నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి, తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి 4.72 కోట్ల రూపాయలు, 15 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 1.60 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
నియోజకవర్గంలో గిరిజన పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల 72 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. పలుమార్లు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి సమస్యలు తెలుసుకుని, నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి విన్నవించడంతో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
పాఠశాలల వారీగా నిధుల కేటాయింపు
భైంసాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఒక కోటి 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదనపు తరగతి గదుల నిర్మాణం, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ కోసం నిధులు ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా కుబీర్ మండలంలోని దోడర్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు 99 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. తానూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు కోటి 73 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు
నియోజకవర్గంలో 15 గిరిజన తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కోటి 60 లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. ఒక్కో కమ్యూనిటీ హాళ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కుభీర్ మండలంలోని రంగశివిని తండా, బ్రహ్మేశ్వర్ తండా, ఫకీర్ నాయక్ తాండ, దోడర్న తండా నెంబర్ 5, రంజని తాండ, మండలంలోని నరసింహ నగర్ తాండ, నగర్ తండా, తానుర్ మండలంలో ఝరితండా, హిప్నల్లి తాండ, బామ్నీ తాండ, ముధోల్ మండలంలో చింతకుంట తండా, ఎడ్ బిడ్ తండా, విట్టొలి తండా, కుంటాల మండలంలో అంబకంటి తండా, హన్య తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.
ధన్యవాదాలు తెలిపిన రాజేష్ బాబు
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కోసం నాలుగు కోట్ల 72 లక్షల రూపాయల నిధులు, తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కోటి 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రి ఆడ్లురి లక్ష్మణ్ కు, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కూడా ధన్యవాదాలు తెలిపారు.












