హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, భవిష్యత్లో రాజకీయాల్లోకి రావాలనుకునే ఆశావహుల కోసం ఒకరోజు రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ స్ట్రాటజీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త రజనీకాంత్ ఎర్రబెల్లి, ఆయన బృందం మార్గదర్శకత్వం వహించారు.
స్థానిక స్థాయిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ప్రాథమిక అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 2,000 మంది నమోదు చేసుకోగా, వెయ్యికిపైగా మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చిన కొందరు సరైన అవగాహన లేకుండా అధికంగా ఖర్చు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శిక్షణలో అంశాలు
నాయకత్వ లక్షణాలు, ప్రజలతో సంబంధాలు, ప్రజల్లో గుర్తింపు పొందేందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎన్నికల సమయంలో పరిమిత వ్యయంతో కార్యక్రమాలను నిర్వహించే విధానాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నగరపాలక సంస్థలో భవిష్యత్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు సహా వివిధ ప్రాంతాల నుంచి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు, కుటుంబాల స్థాయిలో ప్రత్యేక నాయకత్వ శిక్షణకు అవకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో నుంచి నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
గత పదేళ్లుగా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులతో పనిచేసిన అనుభవంతో శిక్షణ అంశాలను రూపొందించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాతో పాటు భవిష్యత్లో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు శిక్షణ ద్వారా రాజకీయాలను కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు అవకాశం లభించిందని నిర్వాహకులకు తెలిపారు.












