హైదరాబాద్: ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (42) మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరారు.
ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన దీప్తి రెడ్డి ఆరోగ్యం వైద్యుల ప్రయత్నాలు ఫలించక విషమించింది. ఈ నెల 26న వైద్యులు ఆమెను బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
దీంతో ఆమె భర్త ప్రదీప్ రెడ్డి, కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ అవయవదానానికి అంగీకరించారు. దీప్తి రెడ్డి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను దానం చేశారు.
ఈ అవయవాలను అవసరమైన నలుగురు రోగులకు అమర్చేందుకు జీవన్‌దాన్ సంస్థ ఏర్పాట్లు చేసింది. తన జీవితాన్ని కోల్పోయినా.. అవయవదానం ద్వారా నలుగురికి కొత్త జీవితం అందించిన దీప్తి రెడ్డి కుటుంబం చూపిన మానవత్వం పలువురికి ఆదర్శంగా నిలిచింది.












