సినిమాలు కేవలం కథ, కథనం, యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా.. వాటిలో ఉపయోగించే ఆధ్యాత్మిక అంశాలతోనూ కొన్నిసార్లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ప్యారడైజ్ చిత్రంపై జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా చిత్రంలో ధూమావతి అమ్మవారి ప్రస్తావన, కాకి ప్రతీక, మంత్రోచ్ఛారణ వంటి అంశాలపై ఆయన స్పందించారు.
దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అమ్మవారిని ప్యారడైజ్ చిత్రంలో ప్రత్యేకంగా చూపించారని వేణు స్వామి పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మవారి వాహనంగా భావించే కాకిని చిత్రంలో ఉపయోగించడం, అలాగే ఓ యాక్షన్ సన్నివేశంలో ధూమావతి అమ్మవారికి సంబంధించినదిగా పేర్కొంటున్న మంత్ర ధ్వనులను నేపథ్య సంగీతంలో వినిపించడం తన దృష్టిని ఆకర్షించిందని ఆయన చెప్పారు. ధూమావతి అమ్మవారిని తంత్ర సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన దేవతగా భావిస్తారు. అలాంటి శక్తివంతమైన దేవతకు సంబంధించిన మంత్రాలు, ఆరాధనా విధానాలను సాధారణంగా తీసుకోవద్దని వేణు స్వామి పేర్కొన్నారు. ప్రత్యేకించి మంత్రోచ్ఛారణ, ఆవాహన వంటి అంశాలు సంప్రదాయ నియమాలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించాల్సిన విషయాలని ఆయన అన్నారు. షూటింగ్ లేదా నేపథ్య సంగీతం కోసం ఇలాంటి అంశాలను ఉపయోగించినప్పుడు కూడా వాటి ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని అర్థం చేసుకుని వ్యవహరించాలని వేణు స్వామి సూచించారు. నాని హీరోగా నటించిన ప్యారడైజ్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. చిత్రంలోని కథా నేపథ్యానికి అనుగుణంగా పలు ప్రత్యేకమైన ప్రతీకలను, ఆధ్యాత్మిక అంశాలను దర్శకుడు ఉపయోగించారు. ప్రస్తుతం ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నాని మాస్ అవతార్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ప్యారడైజ్ తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని, నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా నిలిచింది.












