తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్, ఆయన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో పోలీస్ వాహనంలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం తీవ్రంగా దెబ్బతింది.
వినాయక నిమజ్జన వేడుకల మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం, పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాకరవాయి గ్రామానికి చెందిన రాకేష్‌కు తలకు బలమైన గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్‌ల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలు, గాయాల తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.












