తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అధికారులకు మంత్రి సూచనలు
లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.












