రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు పంచాయతీ రాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ వస్తువుల వాడకం పెరుగుతుంది.
మండలంలోని బోరిగాం గ్రామ పంచాయతీలో శనివారం స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి, వాటి వినియోగం, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి ఎంపీడీవో లక్ష్మణ్ కాంతారావు వివరించారు. పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, మన రాష్ట్రం చేపట్టిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా, పంచాయతీ రాజ్ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలు, అక్కడికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది తాగునీరు, భోజనాల కోసం ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ వస్తువులను వాడేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ అజిత్ ఖాన్, గ్రామ సర్పంచ్ గోదావరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ నరేష్ రెడ్డి, ముత్యం రెడ్డి, వార్డ్ మెంబర్లు పి అశోక్, లత, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ శ్రీకాంత్, ఎన్ గీతా గంగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.












