అమెరికాలోని కాలిఫోర్నియాలో హాలోవీన్ వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో గర్భిణీ మహిళ మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు 17 ఏళ్ల టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫెయిర్‌ఫీల్డ్ నగరంలో సోలానో టౌన్ సెంటర్ మాల్లో వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో స్పిరిట్ హాలోవీన్ దుకాణంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. హాలోవీన్ పండుగ కోసం దుస్తులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు తుపాకీ శబ్దాలు వినిపించడంతో భయంతో పరుగులు తీశారు.
గర్భిణీ మహిళే లక్ష్యం
ఈ కాల్పుల్లో 31 ఏళ్ల కాన్స్టాన్స్ హేజెస్ అనే గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమెను నిందితుడు ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, బాధితురాలికి, నిందితుడికి మధ్య గతంలో ఏదో వివాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఆరుగురికి గాయాలు
ఈ ఘటనలో మరో ఆరుగురు పురుషులు తుపాకీ గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. బాధితుల్లో 16, 19, 32, 23, 19, 43 ఏళ్ల వయసున్నవారు ఉన్నారు. వీరిలో ఒక 19 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరికి చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
17 ఏళ్ల బాలుడి అరెస్ట్
కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోగా, పోలీసులు దుకాణంలోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించి అతడిని గుర్తించారు. ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ విభాగానికి చెందిన ఓ పాఠశాల భద్రతా అధికారి కూడా నిందితుడిని గతంలో విద్యార్థిగా గుర్తించి సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు న సుయిసన్ సిటీలోని ఓ నివాసంలో 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిపై హత్య, హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు గర్భిణీ కావడంతో అదనపు హత్యాభియోగం నమోదు చేయాలా అనే అంశాన్ని సోలానో కౌంటీ ప్రాసిక్యూటర్లు పరిశీలిస్తున్నారు.
అరెస్టయిన బాలుడికి గతంలోనూ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2025లో ఫెయిర్‌ఫీల్డ్ హైస్కూల్ పార్కింగ్ ప్రాంతంలో ఓ కారుపై కాల్పులు జరిపిన కేసులో అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో కొన్ని నెలలపాటు జువెనైల్ నిర్బంధ కేంద్రంలో ఉన్న అనంతరం విడుదలయ్యాడు.
మైనర్ల నేరాల విషయంలో కాలిఫోర్నియా చట్టాలు మరింత కఠినంగా ఉండాలని ఫెయిర్‌ఫీల్డ్ పోలీస్ చీఫ్ డాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. గతంలోనూ కాల్పుల ఘటనలో నిందితుడి ప్రమేయం ఉన్నప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఘటనపై ఎఫ్‌బీఐకి చెందిన శాక్రమెంటో విభాగం స్థానిక పోలీసులకు సహకరిస్తోంది. కాల్పుల నేపథ్యంలో సోలానో టౌన్ సెంటర్లో నిర్వహించాల్సిన హాలోవీన్ వేడుకలను రద్దు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







