భైంసా, 21 September
మండలంలోని పెండ్పెల్లి గ్రామంలో రూ.2.36 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికిన ఈ సందర్భంగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
మండలంలోని పెండ్పెల్లి గ్రామంలో రూ.2.36 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో, పూలు చల్లుతూ, డప్పు చప్పుళ్ల మధ్య స్వాగతం పలకడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, రూ.57 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.14 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ, రూ.7 లక్షలతో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులతో పాటు రూ.కోటి నిధులతో నిర్మించిన బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పెండ్పెల్లి గ్రామ అభివృద్ధికి రూ.2.36 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


