భారతీయ హజ్ యాత్రికుల సంక్షేమానికి సౌదీ అరేబియా అందిస్తున్న సహకారాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించారు. 2027 హజ్ యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న ఆరో హజ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆరో హజ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి, హజ్ శాఖ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అఫ్జల్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌదీ హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్‌తో సమావేశమయ్యారు.
భారతీయ యాత్రికులకు సౌదీ సహకారం
భారతీయ హజ్ యాత్రికుల సంక్షేమానికి సౌదీ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి కిరణ్ రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. 2027 హజ్ యాత్ర విజయవంతం కావడానికి ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వారి భద్రత, ప్రయాణ ఏర్పాట్లు, వసతి వంటి అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి.
2027 హజ్ యాత్రకు ద్వైపాక్షిక ఒప్పందం
భారత్, సౌదీ అరేబియా మధ్య 2027 హజ్ యాత్రకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం కీలకమైనది. ఈ ఒప్పందంలో ప్రధానంగా భారతీయ యాత్రికులకు హజ్ కోటా కేటాయింపు, విమాన ప్రయాణ ఏర్పాట్లు, మక్కా, మదీనాలో వసతి సౌకర్యాలు, రవాణా, వైద్య సదుపాయాలు, మినా ప్రాంతంలో యాత్రికులకు సౌకర్యాలు, యాత్రికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ఇరు దేశాలు సమన్వయం చేసుకోనున్నాయి.
ఫ్లోటింగ్ మసీదు సందర్శన
జెడ్డాలోని చారిత్రక అల్ రహ్మా మసీదును కూడా కిరణ్ రిజిజు సందర్శించారు. దీనినే ఫ్లోటింగ్ మసీదు అని పిలుస్తారు. ఎర్ర సముద్ర తీరంలో ఉన్న ఈ మసీదు సౌదీ అరేబియా ఇస్లామిక్ వారసత్వానికి, అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హజ్ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 2027 హజ్ కోసం భారతదేశానికి మొత్తం 1,75,025 మంది యాత్రికుల కోటా ఉంటుందని అధికారిక హజ్ గ్రూప్ ఆర్గనైజర్స్ పోర్టల్‌లో పేర్కొన్నారు. మొత్తం హజ్ కోటా 1,75,025 కాగా, ఇందులో హజ్ కమిటీ వాటా 1,22,518 (70), ప్రైవేట్ ఆపరేటర్ల వాటా 52,507 (30)గా ఉంది.
2027 హజ్ యాత్రకు ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించడం ద్వారా భారతీయ యాత్రికులకు మెరుగైన వసతి, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత కల్పించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్సౌదీ అరేబియా మధ్య సహకారం ఈ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించనుంది.











