ఇంద్రవెల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) అక్టోబర్ 21
మండలంలోని పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదిలాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.24 లక్షల నగదు, 14 సెల్ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు స్థలం కల్పించిన జిన్నింగ్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 సెల్ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఉట్నూర్ అదనపు పోలీసు అధికారి రుత్విక్ సాయి కొట్టే వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి చేసింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్థల యజమానికి తెలిసే అక్కడ పేకాట నిర్వహించినట్లు వెల్లడవడంతో, స్థల యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో టెహెరె గణేష్ (32), జాదవ్ దత్త (29), జాదవ్ సతీష్ (35), కేంద్రే సందీప్ (40), ముప్పవరపు వంశీ (29), కాగ్నే గైనినాథ్ (29), సూర్యవంశీ తథాగత్ (26), చింతవార్ సందీప్ (38), ఫడ్ విశాల్ (24), పాండే సంతోష్ (29), ఫడ్ విజయ్ (27), డగ్గే సుధాకర్ (30), నాన్లన్వార్ హృదయ్ (23), గైక్వాడ్ నారాయణరావు ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
జిల్లాలో పేకాట, గంజాయి, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని అదనపు పోలీసు అధికారి రుత్విక్ సాయి కొట్టే కోరారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలోని 8712659973 వాట్సాప్ నంబరుకు సమాచారం పంపవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు అధికారి హెచ్చరించారు.


