మండలంలోని మొగిలి గ్రామం నుండి వరకు రూ.5.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విద్యార్థులు, రైతులు, ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.
మొగిలి, కోలార్, కోలార్ గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం సాకారం కానుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడితే విద్యార్థులు, రైతులు, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మొగిలి గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. మండలంలో సాగునీటి సమస్య పరిష్కారానికి 28వ ప్యాకేజీ కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్యాకేజీ పూర్తయితే అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని, వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించానని, ప్యాకేజీ సాధనకు నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.
మొగిలి నుంచి జౌలా-కె మీదుగా కళ్యాణి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మండలానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా సంబంధిత మంత్రిని కలిసి విన్నవిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీడీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాల్లో పుస్తక పఠనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం, విజ్ఞానం పెరగడంతోపాటు మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, సంస్కారవంతమైన విలువలు అలవడతాయని పేర్కొన్నారు.
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, జీడీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పుస్తక పఠనాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


