విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ మోసాలు, నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల పట్ల వలస కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (), హైదరాబాద్ అధికారి దేవులపల్లి ఆనంద్ సూచించారు. నకిలీ ఆఫర్ లెటర్లు, వీసాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వలస కార్మికులు సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, మొబైల్ ఫోన్, ఈమెయిల్ తదితర డిజిటల్ వేదికల ద్వారా జరిగే సైబర్ మోసాలు, నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, సబ్ఏజెంట్ల మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (), హైదరాబాద్ అధికారి దేవులపల్లి ఆనంద్ సూచించారు.
బుధవారం హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద ఉన్న ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కార్యాలయంలో, తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల, బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నరేంద్ర పన్నేరు, సిరిసిల్ల జిల్లా గల్ఫ్ కాంగ్రెస్ కన్వీనర్ తోట ధర్మేందర్ లు దేవులపల్లి ఆనంద్‌ను కలిసి వలస కార్మికుల సమస్యలు, విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, సురక్షిత వలస తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా దేవులపల్లి ఆనంద్ మాట్లాడుతూ, విదేశీ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ వేదికల్లో వచ్చే ప్రతి ప్రకటనను నమ్మకుండా, దాని నిజానిజాలను ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి కార్మికుడు తనను తాను రక్షించుకునే విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మోసాల స్వరూపం
ముఖ్యంగా యూరప్ దేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ముందస్తుగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, నకిలీ ఆఫర్ లెటర్లు పంపడం, నకిలీ వీసాలు చూపించడం, పాస్‌పోర్ట్, వ్యక్తిగత వివరాలను సేకరించడం వంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధికారిక మార్గాలే శరణ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన లేదా అధికారికంగా అనుమతించబడిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలని సూచించారు. సబ్‌ఏజెంట్లు, మధ్యవర్తులు లేదా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల మాటలను మాత్రమే నమ్మి విదేశాలకు వెళ్లకూడదని ఆయన స్పష్టం చేశారు.
విదేశీ ఉద్యోగానికి వెళ్లే ముందు సంబంధిత రిక్రూటింగ్ ఏజెన్సీకి చట్టబద్ధమైన అనుమతి ఉందా, ఉద్యోగదాత వివరాలు, ఉద్యోగ ఒప్పందం, వీసా, జీతభత్యాలు, ఉద్యోగ నిబంధనలు తదితర వివరాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితిని మాత్రమే చెల్లించాలని, అదనపు మొత్తాలను డిమాండ్ చేసే వ్యక్తులు లేదా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
విదేశీ ఉద్యోగం కోసం ప్రయాణించే ముందు పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగ ఒప్పందం, ఉద్యోగదాత వివరాలు తదితర ముఖ్యమైన పత్రాల కాపీలను కుటుంబ సభ్యుల వద్ద ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించి అధికారిక సహాయం పొందాలని సూచించారు.











