నిర్మల్, 11 November
రైతుల సమస్యలే అజెండాగా బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. రైతుబంధు బకాయిలు, సాగునీటి సమస్యలు, ధాన్యం బోనస్, రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
రైతుల సమస్యలే అజెండాగా బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. రైతుబంధు బకాయిలు, సాగునీటి సమస్యలు, ధాన్యం బోనస్, రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మరోవైపు కేసీఆర్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో రైతుకు భరోసా
కాళేశ్వరం నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని పోచంపాడు ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను పునరుద్ధరించడంతో పాటు నీటి తీరువా పన్నును రద్దు చేశారని పేర్కొన్నారు. సింగరేణికి కొత్త ఊపిరి పోసి, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రూ.5 లక్షల రైతుబీమా పథకం ద్వారా 93 శాతం మంది సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. 63 వేల మంది బీడీ కార్మికులకు పింఛన్లు అందించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.
మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. మూడుసార్లు రైతుబంధు నిధులు నిలిపివేసిందని, ధాన్యం కొనుగోళ్లలో బోనస్‌ను బోగస్‌గా మార్చిందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు బకాయిలతో పాటు నాలుగో విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. లక్ష క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలి కరువు పరిస్థితులకు కారణమయ్యారని, వరి సాగు వద్దంటూ రైతులను నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు.
రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను కేటీఆర్ సభలో ప్రస్తావించారు. అప్పుల బాధతో బ్యాంకుల వద్ద పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గోండు గూడాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయని ఆరోపించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించిన రూ.50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. మూడేళ్లుగా నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, కేసీఆర్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయని అన్నారు.


