కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) మాజీ ఛైర్మన్ శివశంకరప్ప సాహుకార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సొంతూరు యాదగిరి జిల్లా షహాపూర్‌లో సుమారు రూ.35 కోట్లతో భారీ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆయన ప్రణాళిక రూపొందించినట్లు ఈడీ ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది.
యాదగిరి జిల్లా షహాపూర్‌లో శివశంకరప్ప భార్యకు చెందిన స్థలంలో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఈడీ తెలిపింది. ఇందులో పాఠశాల, హాస్టల్, ఆటస్థలం, షాపింగ్ మాల్, కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయాలని భావించినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన నిర్మాణ నమూనాలు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
వెటర్నరీ వైద్యుల నియామక పరీక్షలో ప్రశ్నపత్రాల సమాధానాలు ముందుగానే అందుకున్న అభ్యర్థి తండ్రిని ప్రతిపాదిత పాఠశాలకు కేర్‌టేకర్‌గా నియమించాలని నిర్ణయించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
పరీక్షల సమాధానాల లీకేజీ.. లంచాల ఆరోపణలు
2019న నిర్వహించిన వెటర్నరీ అధికారుల నియామక పరీక్షకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులకు సమాధానాలు ముందుగానే అందించారని ఈడీ ఆరోపించింది. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో శివశంకరప్ప రూ.20 లక్షల ఒప్పందంలో భాగంగా మూడో ర్యాంకు సాధించిన అభ్యర్థి తండ్రి నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది.
మరోవైపు కేపీఎస్సీ సభ్యురాలు బి.వి.గీత మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి నుంచి రూ.40 లక్షల ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షలు అందుకున్నారని తెలిపింది.
బెయిల్‌పై కోర్టు నిర్ణయం పెండింగ్
శివశంకరప్ప, బి.వి.గీత బెయిల్ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు కర్ణాటక హైకోర్టు కేపీఎస్సీ నియామకాల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పునర్వ్యవస్థీకరించి, ఏడీజీపీ ఆర్. హితేంద్ర నేతృత్వంలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈడీ, సిట్ దర్యాప్తులు పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని సీఐడీకి గడువు ఉంది.








