Hyderabad, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 09
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 137 రకాల ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా బాధితులకు భారీ ఊరట లభించనుంది. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. క్యాన్సర్ చికిత్సలో విస్తృతంగా వినియోగించే 137 రకాల ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను ఏకంగా 96.45 శాతం వరకు తగ్గిస్తున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఫార్మా కంపెనీల ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించిన నేపథ్యంలో ఈ సవరణలు జరిగాయి. నేటి నుంచే అమల్లోకి రానున్న ఈ కొత్త ధరల వల్ల దేశంలో ఏడాదికి ఏకంగా రూ.3,502 కోట్ల మేర బాధితులకు ఆర్థిక భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఔషధ ధరల నియంత్రణ
ఎన్పీపీఏ మార్గదర్శకాల ప్రకారం ఫార్మా కంపెనీలు సమర్పించిన నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 76 ఫార్మా కంపెనీలు 121 రకాల మందులకు సంబంధించిన 1,225 ఫార్ములేషన్ల నూతన రేట్లను సమర్పించగా, అందులో 1,031 ఫార్ములేషన్ల ధరలు గణనీయంగా తగ్గాయి.
దేశవ్యాప్తంగా లభించే వివిధ రకాల 600 ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల ఔషధాల ధరలు 50 శాతానికి పైగా తగ్గడం విశేషం. భవిష్యత్తులో విదేశాల నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఔషధాలు ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఈ ధరల నియంత్రణ విధానం వర్తించే అవకాశం ఉంది.












