మండలం ఉమ్రి (బి) శివారులోని శ్రీరాం మందిర్ సమీప అటవీ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణం, చెట్ల నరికివేత, గ్రావెల్, మొరం తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని శ్రీరాం మందిర్ ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్రకు చెందిన అర్జున్ నారాయణ్ హల్నోర్ అలియాస్ అర్జున్ శాస్త్రి అటవీ శాఖ అనుమతులు లేకుండా శాశ్వత నిర్మాణం చేపడుతున్నారని, చెట్లను నరికి, జేసీబీలతో గ్రావెల్, మొరం తవ్వకాలు చేపడుతున్నారని కమిటీ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అటవీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించి అటవీ భూమిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కోట్నాక రాము మహరాజ్, ఉమ్రి (బి) సర్పంచ్ ఆర్క భరత్ కుమార్, సోయంగూడ సర్పంచ్ ఉర్వేత బాపురావు, సూర్యగూడ సర్పంచ్ షేక్ నజియా-రహీం, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు పటేల్, ఉమ్రి (బి) మాజీ సర్పంచ్ సోయం బోజ్జు, ఉర్వేత రోహిత్, కుంర అచ్చంత్రావు పటేల్, కోట్నక పరమేశ్వర్, గేడం భరత్, వేడ్మ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.


