రవీంద్ర భారతి, హైదరాబాద్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ప్రముఖ సినీ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు స్వర్గీయ పరుచూరి రఘుబాబు 37వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏడో గది నాటిక ప్రదర్శన జరిగింది. ఈ నాటికకు రంగస్థల, టీవీ సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు శ్రీజ సాదినేని దర్శకత్వం వహించారు. గురువుగారి రచనకు దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.
గురువుగారి రచనకు దర్శకత్వం వహించడం అదృష్టం - శ్రీజ సాదినేని* *హైదరాబాద్:* ఎన్ని నాటకాలలో నటించినా, ఎన్ని నాటకాలకు దర్శకత్వం వహించినా గురువు గారు రచించిన నాటికను డైరెక్ట్ చేయడం సంతృప్తిని కలిగిస్తుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రంగస్థల, టీవీ సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు శ్రీజ సాదినేని. ప్రముఖ సినీ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు స్వర్గీయ పరుచూరి రఘుబాబు 37 వ వర్ధంతి సందర్భంగా స్మృత్యంజలి కార్యక్రమాన్ని సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు రచించిన ఏడో గది నాటికను తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీ జయా ఆర్ట్స్ నుండి శ్రీజ సాదినేని దర్శకత్వం వహించి ప్రదర్శించారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువై, అనైతిక బంధాలు, అక్రమ సంబంధాలు పెరిగి హత్యలకు కూడా వెనుదీయని సంఘటనలు జరుగుతున్న రోజుల్లో చక్కని సందేశాన్ని అందించిన ఈనాటిక ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. నటీనటులు అందరూ అద్భుతంగా నటించి, అందరి ప్రశంసలూ అందుకున్నారు. పల్లవి పాత్రలో నటించిన శ్రీజ సాదినేని ప్రేక్షకులతో కంట తడి పెట్టించింది, చప్పట్లు కొట్టించింది. ఇప్పటి వరకు నలభై నాలుగు నాటకాలకు దర్శకత్వం వహించిన శ్రీజ సాదినేని నలభై ఐదవ నాటికగా ఏడో గది నాటికను డైరెక్ట్ చేయడం, అది తమ గురువైన శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి రచన కావడం, వారి కుమారుని స్మృత్యంజలి కార్యక్రమంలో ఈ నాటికను ప్రదర్శించే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకులు వి. యన్. ఆదిత్య మాట్లాడుతూ శ్రీజ సాదినేని అద్భుతమైన నటీమణి అని,ఆమె నటించిన ఎన్నో నాటికలను చూసి ఆమె అభిమానిగా మారానని, ఉత్తమనటిగా ఎన్నో బహుమతులను అందుకున్న శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన నాటకాలను కూడా ఇటీవల కొన్ని చూశానని, నటన, రచన, దర్శకత్వ శాఖలలో శ్రీజ వైవిధ్యాన్ని చూపిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకుంటున్నారని ఆమెను కొనియాడారు. మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ శ్రీజ సాదినేనిని సత్కరించి అభినందించారు. ప్రముఖ సినీ నటులు జెన్నీ, బాషా, ప్రసాద్ తదితరులు నాటికను తిలకించి కళాకారులను అభినందించారు.


