నిర్మల్ జిల్లా మండలంలోని ఝరి బి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పత్తి పంట సాగుపై ఆచరణాత్మక అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులను పత్తి పొలాలకు తీసుకెళ్లి రైతులతో మాట్లాడించారు.
ఝరి బి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక విద్యాభ్యాసంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను గ్రామంలోని పత్తి పంట పొలాలకు తీసుకెళ్లి, అక్కడి రైతులతో ప్రత్యక్షంగా సంభాషించేలా చేసింది.
ఈ సందర్భంగా రైతులు విద్యార్థులకు పత్తి సాగు విధానం, విత్తనాలు నాటడం, పంట పెరుగుదల, కలుపు నివారణ, పంట సంరక్షణ, పత్తి దిగుబడి వంటి కీలక అంశాలను వివరించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓం ప్రకాష్, ఉపాధ్యాయులు సాయి కృష్ణ, రోజా రాణి, దీపిక, గ్రామ రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











