నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు తమ హక్కులు, చట్టాల గురించి తెలుసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి నిఖిత పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
బాల్యం పిల్లల హక్కు అని, ప్రతి ఒక్కరూ పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలని నిఖిత సూచించారు. బాల కార్మికులుగా మారితే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నట్లేనని అన్నారు. 14 ఏళ్లలోపు బాలబాలికలను పనిలో చేర్చుకోవడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. స్త్రీలకు 18, పురుషులకు 21 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయాలని సూచించారు. బాలికలు పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం కింద నమోదైన నేరాల్లో నిందితులకు బెయిల్ పొందడం కూడా కష్టమని వివరించారు. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా తాకడం, ఇతరులు దురుద్దేశంతో తాకడం మధ్య తేడాను గుర్తించాలన్నారు.
ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే వారిని దూరంగా తోసేయడం, గట్టిగా కేకలు వేయడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదులపై విద్యార్థులు, ఉపాధ్యాయులు తక్షణమే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపాధ్యాయులు సైతం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్యాగరి గంగవ్వ - ఎల్లన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఎస్సై శ్రీకాంత్, న్యాయవాదులు నరేందర్, రత్నం, సిరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












