ముధోల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్ పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు.
ముధోల్ రామాలయంలో ప్రతిష్ఠించిన సార్వజనిక జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య నిమజ్జన శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్య కూడళ్ల వద్ద బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, మార్గ మళ్లింపులు, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
శోభాయాత్రలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు ముధోల్ పట్టణంలో 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












