తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొందరు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీటీడీ పేర్కొంది. ఆ ప్రచారాలను ఖండించిన టీటీడీ, లడ్డూ తయారీలో నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. బుధవారం నాడు 71,196 మంది శ్రీవారిని దర్శించుకోగా, 22,581 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా టీటీడీకి 2.46 కోట్ల రూపాయల మేర కానుకలు అందాయి. 3.69 లక్షల లడ్డూలు విక్రయించగా, 1.61 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై ఏణి కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిచ్చెనమెక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. జ్యోతిషశాస్త్రంలో ముత్యాలు చంద్రుడికి ప్రతీక. శ్రీకృష్ణుడు మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల పందిరిగా స్వీకరించి శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ వాహనసేవ విశిష్టత. ఈ ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి. ఈ సందర్భంగా భక్తులతో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ముచ్చటించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, లడ్డూ ప్రసాదం, వాహనసేవల వీక్షణకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీటిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సేవలను మెరుగుపర్చడానికి భక్తులు ఇచ్చిన సూచనలు, సలహాను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు.
కాగా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యమని టీటీడీ పేర్కొంది. ఈ ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. ఆ ఫొటోలో ఉన్నది అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని టీటీడీ తేల్చి చెప్పింది. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించింది. లడ్డూ తయారీ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటామని వివరించింది. శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారని, కొందరు ఉద్దేశపూర్వకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని టీటీడీ సూచించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.












