నిజామాబాద్ నగరంలోని పొద్దుటూరి అపార్ట్మెంట్లో మూడో రోజు వినాయక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు సతీమణి అనసూయ, లలిత-వేణుగోపాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి పవన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం హిందూ సంప్రదాయంలో భాగమని అన్నారు. వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని ఆయన తెలిపారు. బ్రిటిష్ పాలనలో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు ఉన్న సమయంలో బాల గంగాధర్ తిలక్ ప్రజలను ఏకం చేస్తూ గణేష్ ఉత్సవాలను నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలోనూ గతంలో నిజాం, రజాకారుల కాలంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఆంక్షలు ఉన్న సమయంలో కాళోజీ నారాయణరావు వంటి మహనీయులు ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని విఠల్‌రావు ప్రజలకు సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వినియోగం వల్ల నీరు, పర్యావరణం కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల మట్టి గణపతులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం ఉపాధ్యాయుడు శంకర్ చవాన్ వినాయక చవితి పర్వదినం విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. పూజలో పాల్గొన్న దంపతులకు అపార్ట్మెంట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












