వినాయక చవితి వేడుకల సందర్భంగా డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జి.రవి హెచ్చరించారు. మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
వినాయక చవితి వేడుకల్లో డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జి.రవి హెచ్చరించారు. మంగళవారం రాత్రి పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకల సందర్భంగా మండల పరిధిలోని పరిసర గ్రామాల్లో శాంతిభద్రతలకు, ప్రజల ప్రశాంత జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా, నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం, సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. వినాయక మండప నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన సమయాల్లో, అనుమతించిన శబ్ద పరిమితుల్లో మాత్రమే స్పీకర్ బాక్సులు, బ్యాండ్ వంటివాటిని వినియోగించాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ప్రజలకు, వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలిగించరాదన్నారు.
వినాయక మండపాల వద్ద పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు, వినాయక ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రజా శాంతికి భంగం వాటిల్లకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో వన్ టౌన్, టూ టౌన్ సిఐలు నాగభూషణం రావు, సోమనరసయ్య ఉన్నారు.

