మండలంలోని కామోల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపం పనులకు కీలక ముందడుగు పడింది. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్, లైన్ ఎస్టిమేట్, టెక్నికల్ అప్రూవల్ కాపీలను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి గ్రామస్తులకు అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి కళ్యాణ మండపం నిర్మించాలనే గ్రామస్తుల ఆకాంక్ష మేరకు రూ.50 లక్షల నిధులతో నిర్మాణ ప్రక్రియలో ముందడుగు పడిందని తెలిపారు. కళ్యాణ మండపం నిర్మాణానికి టెక్నికల్ అప్రూవల్ మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయితే గ్రామంలో జరిగే ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, దేవాలయ ఉత్సవాలు, వివాహాది శుభకార్యాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్నయ్య, మాజీ సర్పంచులు దత్తారెడ్డి, నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రతాప్ సింగ్, ఆలయ కమిటీ సభ్యుడు బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.




