ఇబ్రహీంనగర్ గ్రామ శివారులోని వేంకట సాయి కాటన్ మిల్ వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను చిన్నకోడూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని సిద్దిపేట, నర్సాపూర్, ఇబ్రహీంనగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.
చిన్నకోడూరు ఎస్ఐ బి. చంద్ర మోహన్, సిబ్బందికి గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అరెస్ట్ అయిన వారిలో సిద్దిపేటకు చెందిన గుండం విష్ణువర్ధన్ రెడ్డి (23), నర్సాపూర్‌కు చెందిన అంబటి లక్ష్మీ నరసింహ (21), ఇబ్రహీంనగర్‌కు చెందిన చేకూర్తి మల్లికార్జున్ (22) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 5.5 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌లోని దిల్పేట్ సమీపంలో గంజాయి సేవించినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












