నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఖతార్ దేశంలో నిర్బంధంలో ఉన్నట్లు తెలిసింది. రాంపూర్ గ్రామానికి చెందిన కుంచెపు గణేష్ (24), మాదాపూర్ గ్రామానికి చెందిన సంపత్ (25) అనే యువకులు రెండున్నర ఏండ్ల కిందట ఉద్యోగాల నిమిత్తం ఖతార్ వెళ్లారు. ఆగస్టు నెలలో, నిషేధిత ప్రదేశంలో సెల్ ఫోన్ వాడారనే ఆరోపణలపై అక్కడి పోలీసులు వీరిని నిర్బంధించారు.
నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కుంచెపు గణేష్ (24), సోన్ మండలం మాదాపూర్ కు చెందిన సంపత్ (25) అనే యువకులు రెండున్నర ఏండ్ల కిందట ఆక్వా క్లిన్ ఫెసిలిటీస్ సేవల కంపెనీలో ఉద్యోగాల నిమిత్తం ఖతార్ దేశానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఆగస్టు నెలలో, నిషేధిత పని ప్రదేశంలో సెల్ ఫోన్ వాడారనే ఆరోపణలపై అక్కడి పోలీసులు వీరిని నిర్బంధించినట్లు సమాచారం. ఈ విషయం పొన్కల్ కు చెందిన సందీప్ ద్వారా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యులకు ఫోన్ ద్వారా తెలిసింది. ఈ వార్తతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను ఎలాగైనా ఖతార్ దేశం నుండి ఇండియాకు రప్పించాలని, అందుకు ప్రభుత్వ పరంగా న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు, శ్రీహరి రావు తక్షణమే స్పందించి రాష్ట్ర ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. యువకుల నిర్బంధానికి సంబంధించిన పూర్తి వివరాలను వారికి అందించారు. వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.












