మోటకొండూరు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 19
తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై 18 రోజులు కూడా గడవకముందే బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే ఈ ఘటనకు కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పెళ్లై పట్టుమని 20 రోజులు కూడా కాలేదు. నవ వధువు కాళ్ళకు ఉన్న పారాణి ఇంకా ఆరనే లేదు. పెళ్లి పందిరి ఇంకా తీయనే లేదు. ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవ వధువు తాను చదువుతున్న కాలేజీపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అయితే అదనపు కట్నం భూతం నవ వధువును బలితీసుకుందని ఆమె కుటుంబ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు శారీరక వేధింపులు, మరోవైపు మానసిక వేధింపులు తీవ్రమవ్వడంతో మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లి ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటనతో కన్నతల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు చావుకు అల్లుడే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20), ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. పల్లవికి చైతన్యపురి పీఎస్ కానిస్టేబుల్‌తో వివాహం జరిగింది. అయితే వరకట్న వేధింపులు తాళలేకనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు
పెళ్లైన తర్వాత నుంచి పల్లవి కాలేజీకి వెళ్లలేదు. అయితే గురువారం నుంచి పల్లవి కాలేజీకి హాజరైంది. శుక్రవారం విద్యార్థులంతా వెళ్లిపోయిన తర్వాత 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది తొలుత జీడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పల్లవి ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
అయితే వరకట్న వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తల్లి సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు మొదలయ్యాయని, అందువల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తల్లి సంధ్య ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పల్లవి తల్లి ఆరోపించినట్లు అదనపు కట్నమే ఆత్మహత్యకు కారణమా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీకి వెళ్లిన రెండోరోజే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సహాయం కోసం హెల్ప్లైన్లు
ఏ సమస్యకు కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లు, ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆలోచనలువస్తే... దయచేసి వెంటనే సహాయం తీసుకోండి. మీ ప్రాంతంలోని మానసిక ఆరోగ్య నిపుణుడిని, కౌన్సెలర్‌ను లేదా సపోర్ట్ హాట్‌లైన్‌ను సంప్రదించండి. మీరు ఒంటరి కాదు. సహాయం మీకు అందుబాటులో ఉంది. అటువంటి ఆలోచనల నుంచి బయటపడేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు.. వన్‌లైఫ్ ఎన్జీఓ: 7893078930, భూమిక- 1800 425 2908, రోష్ని- 8142020033, 040-66202000లలో సంప్రదించండి. బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆత్మహత్యల నివారణకు హెల్ప్‌లైన్ - 9493238208 అందుబాటులో ఉంది.












