జగిత్యాల జిల్లా మండలం వెంకటాపూర్ గ్రామంలో అత్తగారి ఇంటి గేటు ముందు ఓ మహిళ ఆదివారం నిరహార దీక్షకు దిగింది. ఆమె రాకను గమనించిన భర్త బర్కమ్ గణేష్, అత్త బర్కమ్ రాజు, మామ బర్కమ్ గంగాధర్, మరిది బర్కమ్ ప్రణీత్ లు ఇంటికి, గేటుకు తాళాలు వేసి పారిపోయారని బాధితురాలు బర్కమ్ అరుణ ఆరోపిస్తోంది. ఆమె కథనం ప్రకారం, గోబుళాపురం మండలం గోపులాపూర్ కు చెందిన గోవిందుల అరుణ అలియాస్ బర్కమ్ అరుణ కు వెంకటాపూర్ కు చెందిన బర్కమ్ గణేష్ తో 2023 ఆగస్ట్ 31న వివాహం జరిగింది. వివాహం సమయంలో ఆమె తల్లిదండ్రులు 14 తులాల బంగారం, నాలుగు లక్షల రూపాయలు నగదు, లాంఛనాల ప్రకారం ఇతర సామగ్రిని అప్పగించారు. వీరికి హారిక అనే కూతురు జన్మించగా, ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురిచేస్తున్నారు. మీ తల్లిదండ్రులను ఇంకా అదనపు కట్నం ఇవ్వమని అడగాలని, ఆడపిల్ల పుట్టిన నాటి నుండి అరుణను భర్త, అత్త, మామ, మరిది చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
అరుణను, ఆమె తల్లి గోవిందుల పద్మను సైతం గతంలో పలుమార్లు కొట్టి రక్తగాయాల పాలు చేశారని అరుణ ఆరోపిస్తోంది. బిడ్డ పుట్టిన నాటి నుండి నేటి వరకు బిడ్డను, తల్లిని ఇంటికి రాకుండా అనేక రకాల హింసలకు గురిచేసినట్లు, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన 14 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు రూపాయలు కూడా ఇవ్వకుండా అత్తమామలు బర్కమ్ రాజు, బర్కమ్ గంగాధర్ లు కాజేశారని అరుణ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలని, ఇటీవలే అరుణ తండ్రి విదేశాలలో మరణించారని, అప్పుల పాలయ్యారని, బిడ్డను సాధించలేక, పసి బిడ్డతో తాను ఏ పని చేసుకోలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నానని అరుణ తెలిపింది. అనేకమార్లు పలువురు పెద్ద మనుషులతో కలిసి వెళ్లి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని, తమను ఇంట్లోకి అనుమతించి సాధించాలని ఎంత బ్రతిమిలాడినా భర్త, అత్తమామ, మరిది సాగనీయడం లేదని అరుణ ఆరోపిస్తోంది.
కనీసం నా తల్లిదండ్రులు పెట్టిన 14 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు రూపాయలు ఇచ్చినా తన బిడ్డను తాను సాధించుకొని బ్రతుకుతానని ఎంత బ్రతిమిలాడినా మామ గంగాధర్, అత్త రాజు, భర్త గణేష్, మరిది ప్రణీత్ లు కనికరించడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను, తన బిడ్డ అనారోగ్యాల పాలు అయినా భర్త, అత్తమామలు పట్టించుకోవడం లేదని అరుణ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటికైనా తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని అరుణ కోరుతోంది. తన, తన బిడ్డ హారిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగేంత వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష విడిచేది లేదని అరుణ పేర్కొంది. గత రెండేళ్లుగా అనేక ఇబ్బందులు, నరకయాతన అనుభవిస్తున్నట్లు అరుణ ఆరోపిస్తోంది.












