అణిచివేతకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, సమాజానికో పరిమితం కాదన్నారు. నిజాం పాలనలో అణిచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు.
విద్య ద్వారానే భవిష్యత్ తరాలు ఉన్నత స్థాయికి ఎదగగలవనే సందేశాన్ని ఆమె జీవితం చాటిచెప్పిందన్నారు. ఐలమ్మ ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభాముఖంగా కోరారు. ఈ అంశాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రజల తరఫున తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

