బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో, క్రిమిలేయర్ నిబంధనను ఎత్తివేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది.
బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ మాట్లాడుతూ, బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. బీసీల సమస్యలపై చట్టసభల్లో తన వాయిస్ ను వినిపించినందుకు తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో, వాటి పరిష్కారం కొరకు జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపట్టాలని సంఘం ప్రతినిధులు తీన్మార్ మల్లన్నను కోరారు. రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ నిబంధన కేవలం బీసీలకే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీసీలకు క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు ఏ పోస్టులో చేరితే ఆ పోస్టులోనే పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, దేశానికి బీసీ ప్రధాని ఉన్నప్పటికీ బీసీల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చింతా నాగరాజు, బీసీ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, పాలిటెక్నిక్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆంధ్రా బీసీ నాయకులు గిర్రాజ్ రవి, నీలూరి శీనా, యుగంధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

