ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై వాట్సాప్ ద్వారానే పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు, చివరి ఐదు లావాదేవీలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ కొత్త సేవలను ప్రారంభించింది.
పీఎఫ్ ఖాతా వివరాలు వాట్సాప్లో
పీఎఫ్ బ్యాలెన్స్, ఖాతాలో ప్రస్తుతం ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతా పాస్బుక్ సమాచారాన్ని పొందవచ్చు. ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీల వివరాలను పరిశీలించవచ్చు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై)కు సంబంధించిన వ్యక్తిగత మార్గదర్శకత్వం, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు సహాయం పొందవచ్చు. ఈ సేవలతో సాధారణ పీఎఫ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
క్రియారహిత పీఎఫ్ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్మెంట్
ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన క్రియారహిత పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 వరకు నిల్వ ఉన్న అర్హులైన చందాదారులకు ఆటోమేటిక్ సెటిల్మెంట్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా అర్హులైన ఖాతాదారులు తమ పీఎఫ్ డబ్బులను పొందేందుకు ప్రత్యేకంగా క్లెయిమ్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
అయితే, ఇందుకు నిర్దేశించిన గుర్తింపు ధ్రువీకరణ బ్యాంకు ఖాతా వివరాల పరిశీలన పూర్తికావాలి. ఈ ప్రక్రియ అనంతరం అర్హులైన లబ్ధిదారులకు వారి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేస్తారు. ఈ సదుపాయం ద్వారా సుమారు లక్ష ఖాతాలకు సంబంధించిన రూ.5 కోట్ల మొత్తాన్ని చందాదారులకు అందించనున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.
8 కోట్ల మందికి ప్రయోజనం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సేవలను వినియోగించుకుంటున్నారు. డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా పీఎఫ్ సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి విస్తృతంగా వినియోగించే వేదిక ద్వారా సేవలు అందించడం వల్ల ఉద్యోగులకు సమయం ఆదా అవుతుందని, డిజిటల్ సేవల వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.
అయితే పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకునే సమయంలో చందాదారులు అధికారిక ధ్రువీకరించిన వాట్సాప్ సేవలను మాత్రమే వినియోగించుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు పాస్వర్డ్లు బ్యాంకు వివరాలను వెల్లడించకూడదు.


