వాతావరణంలో మార్పులు, గాలులు, వర్షం కారణంగా ధాన్యం నాణ్యతతో సంబంధం లేకుండా కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు కోసిన రైతులు నానా అవస్థలు పడుతున్నారని, సరైన సౌకర్యాలు లేక, రైతులకు టార్పాలిన్లు అందించకపోవడంతో అనుకోకుండా రాత్రి కురిసిన వర్షానికి చాలామంది రైతుల ధాన్యం నీట మునిగిందని ఉప్పు కృష్ణ తెలిపారు. నీట మునిగిన ధాన్యాన్ని కూడా తేమ శాతంతో సంబంధం లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరైన సౌకర్యాలు కల్పించాలని, ప్రతి రైతుకు టార్పాలిన్లు అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడం, పంటలు ఎండిపోవడం, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, పెట్టుబడులు పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప్పు కృష్ణ పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసి, అందుకు సంబంధించిన డబ్బులను వారం రోజులలోపు రైతులకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

