మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎఫ్.ఎస్.సి.ఎస్. కన్వెన్షన్‌లో ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎఫ్.ఎస్.సి.ఎస్. కన్వెన్షన్‌లో ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బెట్టను తట్టుకునే రకాలు, తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలు, పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంటల ఎంపిక సమయంలో వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, విత్తనాల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని తెలిపారు. దేశంలో వంటనూనెలతో పాటు ఇతర వ్యవసాయ ముడి సరుకుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్‌పామ్ సాగును మరింత విస్తరించాలని రైతులకు సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తుండటం అభినందనీయమని పేర్కొన్న ఎంపీ, రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు, ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళాలు, రైతు సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌కు రైతులను సన్నద్ధం చేయడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎరువుల సరఫరా, పంటల బీమా, బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ సాంకేతికత, ఆధునిక సాగు విధానాలు తదితర అంశాలపై మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సంబంధిత అధికారుల నుంచి సమాచారం, సలహాలు పొందాలని సూచించారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే 100 శాతం పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. రైతులు వాస్తవంగా సాగు చేస్తున్న పంటల వివరాలు డిజిటల్‌గా నమోదు కావడం వల్ల పంటల వివరాల్లో మిస్‌మ్యాచ్‌కు అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో జిల్లాలో 80 శాతానికి పైగా నమోదు పూర్తయిందని తెలిపారు. రైతుల వివరాలు డిజిటల్‌గా నమోదు చేయడం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 9,400 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సహాయం, మార్కెట్ సమాచారం అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఆత్మ కమిటీ భైంసా డివిజన్ చైర్మన్ వివేకానంద మాట్లాడుతూ, యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ రాంరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆత్మ కమిటీలను మరింత బలోపేతం చేసి రైతులకు సాంకేతిక, శాస్త్రీయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.











