కామారెడ్డి జిల్లా మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ హెచ్చరించారు. రైతులు, వాహనదారుల భద్రత దృష్ట్యా ఈ విషయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
మండలంలో వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో కొందరు రైతులు తమకు కేటాయించిన కల్లాల్లో కాకుండా రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారని ఎస్సై తెలిపారు. పగటిపూట కనిపించినా, రాత్రి వేళల్లో రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనం లైట్లు కళ్ళల్లో పడటం వల్ల రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలు సరిగ్గా కనిపించక, వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. ద్విచక్ర వాహనదారులకు కూడా ఈ పరిస్థితి ప్రమాదకరం.
కొందరు రైతులు రోడ్లపై ధాన్యం పోసి, వాహనదారులకు కనిపించేలా హెచ్చరికలు పెట్టకుండా రాళ్లు, కట్టెలు పెడుతున్నారు. చీకట్లో అవి కనిపించకపోతే వాహనాలు వాటిని ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ధాన్యం కుప్పలపై దూరం నుంచి కనిపించేలా హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు, సొసైటీలు, ఐకెపి కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరిస్తే ధాన్యం ఆరబెట్టే సమయంతో పాటు రోడ్డు భద్రతను కూడా మెరుగుపరచవచ్చని ఎస్సై పుష్పరాజ్ అన్నారు. రైతులు వీలైనంత వరకు తమకు కేటాయించిన కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.
ఇటీవల కొంతమంది రహదారిపై వడ్లు, మొక్కజొన్న, ఇతర ధాన్యాన్ని ఆరబెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది చట్టరీత్యా నేరమని, ప్రమాదకరమని ఎస్సై తెలిపారు. దీనివల్ల ప్రాణనష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత ధాన్యం ఆరబెట్టిన వారే వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై ఎవరూ ప్రధాన రహదారిపై, గ్రామ రహదారులపై ధాన్యం ఆరబెట్టరాదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసి జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







