మహబూబ్‌నగర్ జిల్లా మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన ఒక కుటుంబం వినాయక నిమజ్జన వేడుకలు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై పాలమాకుల గ్రామ సమీపంలో వీరి వాహనం కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే, మెట్టుగడ్డ తండాకు చెందిన కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కాట్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వశ్రామ్ (45) కుటుంబ సభ్యులు వినాయక నిమజ్జనం అనంతరం ఇన్నోవా కారులో శంషాబాద్ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో పాలమాకుల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కేతావత్ లింబ్యా, కేతావత్ జమున, కాట్రావత్ మాన్సింగ్, కేతావత్ వశ్రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో లింబ్యా, మాన్సింగ్, వశ్రామ్ వ్యాపారాలు చేస్తుండగా, జమున గృహిణిగా ఉన్నారు.
ప్రమాద సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.












